ఆస్ట్రేలియా జట్టు వన్డేలలో రికార్డును సృష్టించింది. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా 20 సిక్సులు బాదింది. వన్డే ప్రపంచ కప్ లో ఓ ఇన్నింగ్స్ లో ఆసీస్ టీమ్ కి సిక్సర్ల పరంగా ఇదే అత్యధికం అని చెప్పాలి. అంతకు ముందు భారత్, పాకిస్తాన్ పై ఆసీస్ జట్టు 19 సిక్సలర్లు బాదింది. ఓవరాల్ గా వరల్డ్ కప్ మ్యాచ్ లో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు ఇంగ్లండ్ (25) పేరిట ఉంది. ధర్మశాల వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (65 బంతుల్లో 85 పరుగులు, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ట్రవిస్ హెడ్ (67 బంతుల్లో 109 పరుగులు, 10 ఫోర్లు, 7 సిక్సర్లు), సుడిగాలి ఇన్నింగ్స్ తో ఆసీస్ జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌట్ అయింది. చివరిలో మ్యాక్స్ వెల్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లీస్ 28 బంతుల్లో 38 పరుగులు, పాట్ కమిన్స్ 14 బంతుల్లో 37 పరుగులు చేయడంతో ఆసీస్ 388 పరుగులు చేయగలిగింది. మరోవైపు ఆఖర్లో కివీస్ బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్ ఆఖరి 4 వికెట్లు పరుగు వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. 49వ ఓవర్ లో ట్రెండ్ బౌల్ట్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను తీశారు. న్యూజిలాండ్ జట్టు 17 ఓవర్లకు 120 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ టార్గెట్ ను న్యూజిలాండ్ ఛేదిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.