దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తామన ఇటీవల మోడీ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పథకం కింద అర్హులైన వారి పేర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఎల్.ఎస్.చాంగ్‌సన్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ స్కీం వెబ్‌సైట్‌లో అందుకోసం ప్రత్యేక సదుపాయం కలిపించినట్లు పేర్కొన్నారు.
ఇందులో పేర్లు నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ హెల్త్ కార్డును అందిస్తున్నారు. కార్డు కలిగిన పేదలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందవచ్చును. అందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించనుంది.