పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్, భాజపా నాయకులు స్పందించారు. ప్రాజెక్టు పనుల్లో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతిని కలిగించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ అన్నారు.
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రాల నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. వీరి మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ప్రమాదంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ స్పందించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మానిక్కం ఠాగూర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రేవంత్ కోరారు.