కామారెడ్డి కలెక్టరేట్ వద్ద శుక్రవారం రాత్రి బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్.. రైతు ఉద్యమానికి అండగా ఉంటామని స్పష్టంచేశారు. కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ అకస్మాత్తుగా చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి.. ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. రెండు గంటల పాటు పోలీసులు, కార్యకర్తల మధ్య పెద్దఎత్తున తోపులాట జరిగింది.
కలెక్టరేట్ లోపలికి అనుమతించాలని కార్యకర్తలు, రైతులు నినాదాలు చేశారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కేందుకు కొందరు రైతులు, మహిళలు ప్రయత్నించారు. చివరకు పోలీసులు బండి సంజయ్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తుండగా కార్యకర్తలు, రైతులు వాహనాన్ని అడ్డుకున్నారు. కొందరు వాహనం అద్దాలు పగలగొట్టడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోయారు.