2023లో టీఆర్ఎస్‌ను సమాధి చేస్తాం: బండి సంజయ్

హైదరాబాద్: 2023లో టీఆర్ఎస్ పార్టీని సమాధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శపథం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా అమరుల కుటుంబాలకు న్యాయం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని విమర్శించారు. కేసీఆర్ పై పోరాటానికి అన్నివర్గాలు, ఉద్యమకారులు బీజేపీతో కలసి రావాలని పిలుపునిచ్చారు.

‘‘అమరవీరుల త్యాగల ఫలితమే తెలంగాణ. రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ, సుష్మాస్వరాజ్ పాత్ర కీలకం. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పడు పార్లమెంటులో కేసీఆర్ లేడు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా మూరఖత్వ పాలన నడుస్తోంది. కేసీఆర్ కుటుంబం, ఎమ్ఐఎమ్ కోసమే తెలంగాణ తెచ్చుకున్నారన్న చర్చ మేధావుల్లో జరుగుతుంది. తన పరిపాలనపై కేసీఆర్ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోవాలి. గతంలో ఇచ్చిన హామీలేంటి?. ఇప్పుడేమి జరుగుతోందో కేసీఆర్ తెలుసుకోవాలి. దళితుడిని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుకుంటానన్న కేసీఆర్ ఇప్పుడేమి సమాధానం చెప్తాడు?.’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.