పెట్రోల్ పై రూ. 41 దోచుకుంటుంది కెసిఆర్ ప్రభుత్వమే : బండి సంజయ్ సంచలనం

లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్నది కేసీఆర్ సర్కార్ అని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. హుజురాబాద్ నియోజక వర్గం లోని కమలాపూర్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ పై పన్ను పేరుతో రూ.వేల కోట్లు దోచుకుంటోంది టీఆర్ఎస్సే అని ఫైర్ అయ్యారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

ప్రజల పై ప్రేమ ఉంటే రూ.41 మినహాయించుకుని రూ.60 కే లీటర్ పెట్రోల్ అందించాలని సవాల్ విసిరారు. కేంద్రం నిధులను దారి మళ్లించి హుజూరాబాద్ లో ఓటుకు రూ.20 వేలతో కొనుగోలు చేసే కుట్ర జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. టీఆర్ఎస్ పంచే డబ్బులతో ఆ పార్టీ నేతలు కొత్త కార్లు కొంటున్నారని.. ఒక్కో ఎకరానికి యూరియా, డీఏపీపై దాదాపు రూ.6 వేలు సబ్సిడీ ఇస్తోంది కేంద్రమేనని స్పష్టం చేశారు.

ఫ్రీగా యూరియా ఇస్తానన్న కేసీఆర్ మాటలేమైనయ్ ? దళిత బంధు పై హుజూరాబాద్ నుండే యుద్దం ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ ని గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచైనా దళితులందరికీ దళితబంధు అందిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్.