తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతుండటంతో కాషాయం నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టారు. మొదటి దశ ప్రజా సంగ్రామయాత్రను పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక్కటైన జోగులాంబ ఆలయం నుంచి రెండో దశ యాత్ర ప్రారంభం అయింది. అవినీతి, నియంత, కుటుంబ పాలన నిర్మూలనే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు బండి సంజయ్. ఈ నెల 14న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర అట్టహాసంగా ముగిసింది. అయితే తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి హాజరైన బండి మూడో విడత పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు.
వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ లో బీజేపీ బూత్ కమిటీ సమావేశానికి బుధవారం బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన వెంట ఆ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ కమిటీలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని బండి అన్నారు. తెలంగాణ లో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ సైకో లాగా మారాడని విమర్శించారు. ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని బండి మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26న ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని మోడీ భేటీ కానున్నారు.