కాంగ్రెస్ లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని SRR కాలేజీలో బండి సంజయ్మ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పలువురితో మాట్లాడారు. చాలా స్పష్టంగా మా ప్రధాని అభ్యర్థి అని చెబుతున్నాం. అలాగే కాంగ్రెస్ నేతలు చెప్పి ఓటు అడగాలని సూచించారు. ఇండియన్ పొలిటికల్ లీగ్ లో మా కెప్టెన్ మోడీ అని ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానం అని సెటైర్ వేశారు. కేవలం ఎన్నికలప్పుడే కేసీఆర్ బయటకు వస్తారు.. మిగతా సమయమంతా ఫామ్రాజ్లోనే గడుపుతారని అన్నారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్లా లేని పార్టీకి ఓటు వేస్తే అది నిరుపయోగంగా మిగిలిపోతుందని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను దేశం నమ్మడం లేదు. కనీసం పీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదు. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడి వారో తెలియదు. అలాంటి వారికి ఓటెలా వేస్తారని అన్నారు. కొండగట్టుకు, వేములవాడకు నిధులు ఇస్తాం అంటే మాజీ సీఎం కేసీఆర్ సహకరించలేదు. కేసీఆర్కు వినోద్ ఎందుకు లేఖ రాయలేదని అడిగారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడే కేసీఆర్ అలారం పెటుకుని నిద్ర లేసారని సంజయ్ అన్నారు.