HDFC నుంచి ఐదు కొత్త బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులు..ఆఫర్లు ఇవే

-

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. క్రెడిట్‌ కార్డును మన అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకుంటే.. ఆఫర్లు ఎక్కువ ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే వాటిలాగే వీటిని వ్యాపార ఖర్చుల కోసం వాడుకోవచ్చు. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బిజ్‌ఫస్ట్‌, బిజ్‌గ్రో, బిజ్‌పవర్‌, బిజ్‌బ్లాక్ పేరిట నాలుగు బిజినెస్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చింది. వాటి వివరాలేంటో చూద్దాం.

బిజ్‌ఫస్ట్‌ కార్డు పొందేందుకు వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.6 లక్షలకు పైన ఉండాలి. 55 రోజుల వరకు వడ్డీరహిత క్రెడిట్‌ లభిస్తుంది. ఈఎంఐ చెల్లింపులపై మూడు శాతం క్యాష్‌ పాయింట్లు ఉంటాయి. యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రానిక్స్‌, పేజాప్‌ లావాదేవీలపై రెండు శాతం, ఇతర వ్యయాలపై ఒక శాతం క్యాష్‌ పాయింట్లు పొందొచ్చు. ఈ కార్డు జాయినింగ్‌, పునరుద్ధరణ ఫీజు రూ.500. పన్నులు అదనం. తొలి ఏడాదిలో రూ.50 వేలు ఖర్చు చేస్తే తర్వాత సంవత్సరం రెన్యువల్‌ ఫీజును రద్దు చేస్తారు. స్విగ్గీ డైనౌట్‌ ద్వారా చేసే రెస్టారంట్‌ బిల్లు చెల్లింపులపై 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

బిజ్‌పవర్‌..

బిజ్‌పవర్‌ కార్డు కోసం వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.12 లక్షలకు పైగా ఉండాలి. ఈ కార్డుతో వ్యాపార అవసరాల నిమిత్తం చేసే ప్రతి రూ.150 ఖర్చుపై ఐదు రివార్డు పాయింట్లు లభిస్తాయి. బిల్లులు, పన్ను చెల్లింపులు, వ్యాపార ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. దేశీయ విమానాశ్రయాల్లో లాంజ్‌ యాక్సెస్‌ ఉచితం. మిగతా కార్డుల్లోలాగే దీని బిల్లింగ్‌ సైకిల్‌ కూడా 55 రోజులు. అంటే ఈ వ్యవధిలో బకాయిలు చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. ఈ కార్డు జాయినింగ్‌, పునరుద్ధరణ ఫీజు రూ.2,500. పన్నులు అదనం. తొలి ఏడాదిలో కనీసం రూ.4 లక్షలు ఖర్చు చేస్తే తర్వాత సంవత్సరం రెన్యువల్‌ ఫీజు ఉండదు. దేశీయంగా 16 ఎయిర్‌పోర్టు లాంజ్‌ యాక్సెస్‌లు ఉచితం. ఒక త్రైమాసికంలో రూ.75,000 ఖర్చు చేస్తే మరో రెండు అదనపు యాక్సెస్‌లు లభిస్తాయి. ప్రియారిటీ పాస్‌ను ఉపయోగించి అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ లాంజ్‌ యాక్సెస్ పొందొచ్చు.

బిజ్‌గ్రో..

బిజ్‌గ్రో కార్డుపై కూడా 55 రోజుల వడ్డీరహిత క్రెడిట్ గడువు ఉంటుంది. బిజినెస్‌ అవసరాల కోసం చేసే ప్రతి రూ.150 ఖర్చుపై రెండు క్యాష్‌ పాయింట్లు లభిస్తాయి. బిల్లులు, పన్ను చెల్లింపులు, వాణిజ్య సంబంధిత ప్రయాణాల కోసం చేసే ఖర్చులపై 10 పాయింట్లు లభిస్తాయి. వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.6 లక్షలకు పైన ఉండాలి. ఈ కార్డు జాయినింగ్‌, యాన్యువల్‌ ఫీజు రూ.500. పన్నులు అదనం. తొలి ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే తర్వాత సంవత్సరం రెన్యువల్‌ ఫీజును రద్దు చేస్తారు. రూ.400 నుంచి రూ.5,000 ఇంధన బిల్లుపై ఒక శాతం ఫ్యుయల్‌ సర్‌ఛార్జ్‌ రద్దు ప్రయోజనం ఉంటుంది. అలా గరిష్ఠంగా ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. స్విగ్గీ డైనౌట్‌ ద్వారా చేసే రెస్టారంట్‌ బిల్లు చెల్లింపులపై 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

బిజ్‌బ్లాక్‌..

దీంట్లోనూ ప్రతి రూ.150 వ్యాపార ఖర్చులపై ఐదు రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఎయిర్‌పోర్టుల్లో అపరిమిత లాంజ్‌ యాక్సెస్‌ ఉంటుంది. ట్యాలీ, ఆఫీస్‌ 365, ఏడబ్ల్యూఎస్, గూగుల్‌, క్రెడ్‌ఫ్లో, అజూర్‌ సహా ఇతరత్రా బిజినెస్‌ ప్రొడక్టివిటీ టూల్స్‌పై చేసే వ్యయాలకూ రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఒక స్టేట్‌మెంట్‌ సైకిల్‌లో కనీసం రూ.50 వేలు ఖర్చు చేస్తే రివార్డు పాయింట్లను క్లెయిం చేసుకోవచ్చు. ఈ కార్డు జాయినింగ్‌, పునరుద్ధరణ ఫీజు రూ.10 వేలు. పన్నులు అదనం. కార్డు పొందిన 90 రోజుల్లోగా రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తే తొలి ఏడాది రెన్యువల్‌ ఫీజును రద్దు చేస్తారు. వార్షిక ఐటీఆర్‌ విలువ రూ.21లక్షలకు పైన ఉండాలి.

ఐటీఆర్‌, జీఎస్‌టీ రిటర్నులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, మర్చంట్‌ పేమెంట్‌ రిపోర్టులను ఉపయోగించి ఈ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21-65 ఏళ్ల వయసున్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న భారత పౌరులు వీటికి అర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news