ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకుండా కీలక వడ్డీ రేట్లను కొనసాగించింది. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు.
భారతదేశానికి ధృఢమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరిగిందని, అందుకే ఈ ద్రవ్యోల్బణాన్ని కట్టిడి చేసేందుకు ఆర్బీఐ కృషి చేస్తుందని తెలిపారు.
ఆర్‌బీఐ మోనటరీ పాలసీ నిర్ణయాలు
- గ్లోబల్ డెట్-టు-జీడీపీ నిష్పత్తి ఎక్కువగా ఉంది. కనుక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై స్పిల్-ఓవర్ ప్రభావం ఉండవచ్చు.
- ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ డిమాండ్, వినియోగం పెరుగుతోంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి తొడ్పడుతుంది.
- ద్రవ్యోల్బణం ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరం ఉంది.
- తయారీ, సేవల రంగాల్లో స్థిరమైన వృద్ధి సాధించడానికి ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది.