కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా ఖమ్మం జిలా మధిర శాసన సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యారు. సీఎల్పీ పదవి కోసం గత కొద్ది నెలలుగా అంతర్గత పోటీ నడుస్తున్నప్పటికీ అధిష్టానం భట్టి విక్రమార్క వైపే మొగ్గు చూపింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఆయన్ను సీఎల్పీ నేతగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దళిత వర్గాలకు చెందిన భట్టిని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తే బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ మరోసారి నిలిచినట్లు ఉంటుందని రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రచార కమిటీ చైర్మన్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే ఆనవాయితీ కాంగ్రెస్‌కు ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు వినిపించడంతో రాజకీయ వర్గాల్లో సీఎల్పీ పదవి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.