భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సౌరవ్ గంగూలీ స్థానంలో బోర్డు పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా బిన్నీ మాట్లాడుతూ, ఇటీవల ఆటగాళ్లు తరచుగా గాయాలపాలవుతున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని వెల్లడించారు. తాము ఈ అంశంపై దృష్టిసారిస్తామని రోజర్ బిన్నీ తెలిపారు. ఆటగాళ్లు గాయపడడానికి తక్కువ అవకాశాలు ఉండే విధానాల అమలుకు చర్యలు తీసుకుంటామని అన్నారు రోజర్ బిన్నీ. అందుకోసం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, ఆటగాళ్లకు గాయాలు అంశంపై టీమిండియా మేనేజ్ మెంట్ తోనూ, ఎన్సీఏతోనూ సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు రోజర్ బిన్నీ.
కొన్ని నెలల వ్యవధిలోనే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్ వంటి ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అంతకుముందు కేఎల్ రాహుల్ సైతం గాయపడగా, ఇటీవలే కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో, టీమిండియా ఆటగాళ్లలో ఫిట్ నెస్ లోపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కోహ్లీ కెప్టెన్ గా వైదొలిగాక జట్టులో ఫిట్ నెస్ ప్రమాణాలు పడిపోయాయన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆటగాళ్ల ఫిట్ నెస్ ను అంచనా వేసేందుకు నిర్వహించే యో-యో టెస్టును ఇప్పుడు అమలు చేయడంలేదని కూడా తెలుస్తోంది.