కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన పలువురు ప్లేయర్లు, సిబ్బంది కోవిడ్ బారిన పడడంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ లీగ్‌ను ఎప్పుడు నిర్వహించేది బీసీసీఐ చెప్పలేదు. అయితే ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ ప్లేయర్లు మాత్రం మన దేశంలో చిక్కుకుపోయారు. ఆయా దేశాలలో భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడంతో వారికి ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కానీ బీసీసీఐ వారిని సురక్షితంగా సొంత దేశాలకు పంపిస్తామని చెప్పింది.
భారత్‌లో చిక్కుకున్న విదేశీ ప్లేయర్లను శ్రీలంక లేదా మాల్దీవ్స్‌కు తరలించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్లేయర్లకు చెందిన దేశాల క్రికెట్ బోర్డులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశీ ప్లేయర్లను శ్రీలంక లేదా మాల్దీవ్స్‌లో కొన్ని రోజుల పాటు ఉంచి తరువాత వారిని తమ తమ దేశాలకు పంపిద్దామని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై గంగూలీ చర్చిస్తున్నారు. దీంతో అతి త్వరలోనే ఈ విషయమై స్పష్టమైన ప్రకటన రానుంది.
అయితే భారత్‌లో చిక్కుకుపోయిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన ప్లేయర్లు, కోచ్‌లు, సిబ్బందే 40 మంది వరకు ఉన్నట్లు తెలిసింది. దీంతో వారందరినీ ముందుగా శ్రీలంకకు లేదా మాల్దీవ్స్‌కు తరలించి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు తరలిస్తారని సమాచారం. భారత్ నుంచి ఎవరూ తమ దేశానికి రాకూడదని, వస్తే 66000 డాలర్ల జరిమానా, 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆ దేశ ప్లేయర్లను సురక్షితంగా తరలించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.