కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ఇతర అన్ని రైళ్లను రద్దు చేశారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఏసీ బోగీల్లో రైల్వే శాఖ వారు ప్రయాణికులకు బ్లాంకెట్లు, దిండ్లు, బెడ్‌షీట్లు ఇవ్వడం లేదు. కరోనా వల్ల వాటిని ఇవ్వడం ఆపేశారు. అయితే కరోనా పూర్తిగా తగ్గాక కూడా వాటిని ఇవ్వకూడని రైల్వే భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు తాజాగా రైల్వే అధికారులు జోనల్ స్థాయి ఉద్యోగులతో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ విషయంపై చర్చించినట్లు తెలిసింది.
రైళ్లలో ఏసీ బోగీల్లో ఒక్క లినెన్ సెట్‌ను ఉతికేందుకు రైల్వే రూ.40 నుంచి రూ.50 వరకు ఖర్చు చేస్తోంది. మొత్తం 18 లక్షల లినెన్ సెట్లను ప్రస్తుతం రైళ్లలో వాడుతున్నారు. అలాగే రైళ్లలో వాడే బ్లాంకెట్లను నెలకొకసారి ఉతుకుతారు. ప్రతి 48 నెలలకు ఒకసారి బ్లాంకెట్లను మారుస్తారు. ఈ క్రమంలో ఈ పనులకు రైల్వే ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టును ఇస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు రైళ్లలో ఇకపై బెడ్‌షీట్లు, బ్లాంకెట్లను ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.
కరోనా ప్రభావం పూర్తిగా తగ్గినా కొన్నాళ్ల వరకు వాటిని రైల్వే ప్రయాణికులకు అందజేయకూడదని అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేస్తారని భావిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గాక కొంత కాలానికి రైల్వేనే సొంతంగా భారీ లాండ్రీ సెటప్‌ను ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. దీనిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.