మార్కెట్‌లో మనకు రకరకాల కంపెనీలకు చెందిన తేనెలు అందుబాటులో ఉన్నాయి. కొందరు ఈ తేనెలపై నమ్మకం లేక తేనెటీగల పెంపకందారుల వద్దకే వెళ్లి స్వచ్ఛమైన తేనెను కొంటుంటారు. అయితే నిజానికి తేనెటీగల పెంపకం, తేనె అమ్మడం ద్వారా నెల నెలా చక్కని ఆదాయం సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెటీగలను పెంచేందుకు బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఒక్కో బాక్సు ఖరీదు రూ.1వేయి వరకు ఉంటుంది. అలాగే తేనెటీగలు చాలా దూరం వెళ్లి తేనెను సేకరిస్తాయి. కనుక తేనెటీగల కోసం అనువుగా ఉండేందుకు తోటల్లో వాటి పెంపకాన్ని చేపట్టాలి. దీంతో అతి త్వరగా తేనెను సేకరిస్తాయి. అందుకు గాను తోటలను లీజుకు తీసుకోవచ్చు. లేదా తోటలకు దగ్గర్లో స్థలాన్ని తీసుకుని అక్కడ తేనెటీగలను పెంచితే అవి ఎలాగూ పూల వద్దకు వెళ్తాయి కనుక ఇబ్బంది ఉండదు. దీంతో తేనె సేకరణ వాటికి సులభంగా అవుతుంది.
అయితే మొదట్లో 100 బాక్సులతో ఈ వ్యాపారం చేయాలనుకున్నా వాటికి రూ.1000 * 100 = రూ.1 లక్ష అవుతుంది. ఇక స్థలాన్ని లీజుకు తీసుకుంటే అందుకు అయ్యే మొత్తాన్ని స్థల యజమానులకు చెల్లించాలి. అలాగే ఇతర పరికరాలు, సామగ్రి కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం రూ.2 లక్షల పెట్టుబడి పెడితే తక్కువలో తక్కువ తేనెటీగల పెంపకం చేపట్టవచ్చు.
ఇక తేనెటీగలు ఒక బాక్సులో పూర్తిగా తేనెను సేకరించేందుకు కనీసం 21 రోజుల సమయం పడుతుంది. అంటే ఎంత లేదన్నా నెల నెలా తేనె అందుబాటులోకి వస్తుంది కనుక నెల నెలా తేనెను అమ్ముకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు ఉన్నా పాడుకాదు. కనుక తేనెను నిల్వ చేసి కూడా అమ్మవచ్చు. ఒక్క బాక్సు నుంచి సుమారుగా 5 కేజీల తేనె వస్తుంది. 100 బాక్సులకు 500 కిలోల తేనె వస్తుంది.
మార్కెట్‌లో మనం కంపెనీలకు అమ్మితే కిలోకు రూ.100 నుంచి రూ.150 మాత్రమే వస్తాయి. అదే మనమే నేరుగా తేనెను డబ్బాల్లో ప్యాకింగ్ చేసి అమ్మితే రూ.350 నుంచి రూ.400కు పైగానే కిలో తేనెకు డబ్బులు తీసుకోవచ్చు. ఈ క్రమంలో మనకు 500 కిలోల తేనెకు 500 * 350 = రూ.1.75 లక్షలు వస్తాయి. అందులో ఖర్చులు రూ.50వేల వరకు తీసేసినా రూ.1.25 లక్షలు వస్తాయి. అంటే తేనెటీగల పెంపకం తేనె ద్వారా ఎంత లేదన్నా కనీసం నెలకు రూ.1 లక్ష వరకు సంపాదించవచ్చన్నమాట. తేనెటీగల పెంపకం ప్రారంభించాలనుకునే వారికి శిక్షణ కూడా ఇస్తారు. వాటి వివరాలను పూర్తిగా తెలుసుకుని ఈ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుంది.