ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న కార్యక్రమం అమ్మ ఒడి. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచడానికి గాను జగన్ సర్కార్ పిల్లలు ఉన్న తల్లి తండ్రులకు ఆర్ధిక సహాయం చెయ్యాలని భావిస్తుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.6500 కోట్లు కేటాయించింది. జగన్ గురువారం చిత్తూరులో ప్రారంభించబోతున్నారు. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ పథకం అప్పట్లో మహిళలను విశేషంగా ఆకట్టుకోవడం జగన్ కి కలిసి వచ్చింది. ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు అమ్మ ఒడి ఇవ్వాలని భావించినా ఇంటర్ వరకూ వర్తింపజేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు,
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రయివేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తారు. అంత వరకు బాగానే ఉంది గాని, పథకం అమలు విషయంలో ఒకటి మాత్రం లబ్ది దారులకు చికాకుగా మారింది.
ఎంత మంది పిల్లలు ఉన్నా సరే ఒకరికి మాత్రమే అమ్మ ఒడి వర్తిస్తుందని చెప్తున్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఒకరికి పథకం వర్తిస్తుంది. మరి మిగిలిన ఇద్దరినీ ఎవరు చదివిస్తారు…? ఇక ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి, చివరి పిల్లాడికి, మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కారణంగా ఒకరే సంతానం ఉన్న తల్లికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని, అది సరైన ప్రణాళిక కాదని అంటున్నారు.