మెంతులు.. మెంతికూర ఎంతో ఇష్టంగా తింటారు. టమాటతో కలిపి వండితే దాని రుచే వేరు. రుచి ఎంత బాగుంటుందో దాని వల్ల ప్రయోజనాలు కూడా అంతే బాగుంటాయి. ముఖ్యంగా మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆకు కూరలు, కూరగాయల్లో మసాలాగా ఉపయోగించే మెంతుల వల్ల వ్యాధులతో పోరాడే శక్తి పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెంతుల్లో సోడియం, జింక్, భాస్వరం, ఫోలిక్ ఆమ్లం, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అలాగే విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా లభిస్తాయి.
ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాని ప్రకారం మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. అందువల్ల చర్మ వ్యాధులైన తామర, కాలిన చర్మం నుండి ఉపశమనం కలుగుతుంది. మొటిమలని తొలగించి చర్మాన్ని అందంగా మార్చడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి. జుట్టు పెరుగుదలకు మెంతులు చాలా అవసరం. జుట్టు బలహీనంగా ఉంటే మెంతుల్లో ఉండే పోషకాలు వాటిని దృఢంగా చేస్తాయి. దానివల్ల జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అంతే కాదు ఇందులోని ప్రోటీన్ జుట్టు పెరుగుదలకి సాయపడుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు వీటిని ఆహారంగా తీసుకుంటే చాలా మంచిది. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించే లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర శోషణను తగ్గిస్తుంది. పాలిచ్చే తల్లులకి మెంతులు చాలా ఉపకరిస్తాయి. ఫైటీ ఈస్ట్రోజన్లను కలిగి ఉండడంతో పాలిచ్చే తల్లుల్లో పాలను పెంచుతుంది. దానివల్ల పసిపిల్లలకి తల్లిపాల విషయంలో ఇబ్బంది ఉండదు. మలబద్దకం వంటి సమస్యలని దూరం పెట్టడంలో మెంతులు బాగా పనిచేస్తాయి.