ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం కడుపు నిండా తింటే సరిపోదు.. ఆ తినేవి పోషకాలతో నిండి ఉండాలి.. డ్రై ఫ్రూట్స్ డైలీ తింటే.. బాడీకి చాలా మంచిది. ఒమెగా 3 పుష్కలంగా ఉన్న వాల్నట్ బ్రెయిన్ చాలా మంచిది. ఇవి డైలీ తినడం వల్ల స్కిన్ బాగుంటుంది, మెగ్రెయిన్ లాంటి తలనొప్పులు సైతం దూరం చేస్తుంది అంటారు. అయిన్ వాల్నట్‌తో ఆయిల్ కూడా చేస్తారు. దీని ఉపయోగం చాలా మంది తెలియదు. వాల్నట్ నూనెలో కూడా మంచి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల ఉంటాయి, దీనిలో ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. దీనిని మంచి కొవ్వుగా పరిగణిస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో ఈ ఆయిల్ బాగా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాగనికి మేలు చేస్తుంది. ఈరోజు మనం ఈ ఆయిల్‌ను ఎలా వాడాలి, ఏం ఏం లాభాలు ఉన్నాయో చూద్దామా.!
వాల్నట్ ఆయిల్ వల్ల ఉపయోగాలు..
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్త ప్రసరణ సక్రమంగా ఉండటానికి, వాల్నట్ నూనె వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది.
రక్తపోటును నియంత్రించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బరువును నియంత్రించడంలో వాల్నట్ నూనె దోహదపడుతుంది.
వాల్నట్ నూనెలో ఉన్నా పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వాల్‌నట్స్‌లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది, వాల్నట్ నూనె తీసుకోవడం వలన ఇందులో ఉండే ఒమేగా -3 శరీర కొవ్వును తగ్గించటానికి సహాయపడుతుంది.
వాల్నట్ ఆయిల్ అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది.
ఎందుకంటే ఇది ఆరు రకాల బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది.
చర్మానికి…
చర్మ ముడతలను తగ్గిస్తుంది. వాల్నట్ నూనెతో చర్మం మసాజ్ చేస్తే చర్మం మృధువుగా మారుతుంది. ముఖానికి రాసుకుని వేళ్ల సహాయంతో మసాజ్ చేసుకోవటం మంచిది. చర్మం తేమను నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగేలా చేస్తుంది. పెరుగులో తేనె కలిపి అందులో నాలుగు ఐదు చుక్కల వాల్నట్ నూనె వేసి మొఖానికి రాసుకుని ఒక అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొహం కాంతివంతంగా కనిపిస్తుంది.
జుట్టుకు..
కొబ్బరి నూనెలో కొద్దిమొత్తంలో కలుపుకుని జుట్టుకు రాసుకోవచ్చు. జుట్టు రాలటం వంటి సమస్యలను నివారిస్తుంది. చుండ్రు సమస్యను పోగొడుతుంది. తలస్నానం చేసే అరగంట ముందు వాల్నట్ నూనెను, కొబ్బరి నూనె కలుపుకుని తలకు రాసుకుని తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
వీరికి మాత్రం వద్దు..
కొందమందిలో మాత్రం వాల్నట్ అయిల్ దుష్ప్రభావలను చూపిస్తుంది. ఈ ఆయిల్ పడకపోతే చర్మంపై దద్దుర్లు, పెదవుల వాపు, స్కిన్ రాష్, దురుద, గొంతుమంట, తిమ్మిరి, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు దీర్ఘకాలిక జలుబు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతే ఆయిల్‌ను వాడటం మంచిది. ఆయిల్ మీకు పడిందంటే.. బోలెడు లాభాలే..!
వంటల్లో వద్దు..
వాల్నట్ అయిల్‌ను మీ రోజువారీ ఆహారంలో భాగంగా చూసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అయితే.. కూరల్లో వాల్నట్ నూనె వాడితే రుచి చేదుగా ఉంటుంది. వంటల్లో కాకుండా సలాడ్లలో దీనిని వాడుకోవచ్చు.
– Triveni Buskarowthu