ప్రధాని మోడీ హత్య కోసం జరిగిన బీమా కొరెగావ్ కుట్ర విషయంలో విరసం నేత వరవరరావు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర జైల్లో ఉన్న వరవరరావును విడుదల చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రధానికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయంలో జగన్ ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేత సునీల్ దియోధర్ ఒక త్వీట్ చేశారు. జగన్ మీరేమో మోదీతో ఫోటోలు దిగి పెడతారు, మీ ఎమ్మెల్యే ఏమో ఆయన్ని చంపడానికి కుట్ర పన్నిన వారిని విడుదల చేయమని కోరతారు. ఏమిటీ ద్వంద్వ వైఖరి అని ప్రశ్నించారు.
ఇప్పుడు ఈ ట్వీట్ గురించి బీజేపీ నేత సునీల్ దియోధర్ కి భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాశారు. వరవరరావు విడుదల కోరుతూ లేఖ రాసిన మాట వాస్తవమేనన్న ఆయన ప్రధాని హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని సమర్ధించడం నా ఉద్దేశం కాదని అన్నారు. నేరస్తులని హంతకులని ఎప్పుడూ సమర్ధించనని ఆయన పేర్కొన్నారు. అలానే నా వ్యక్తిగత అభిప్రాయానికి జగన్ కి ముడి పెట్టి మీరు ట్విట్టర్ లో రాయడం బాధ కలిగించిందని భూమన లేఖలో పేర్కొన్నారు. 46 ఏళ్ళ క్రితం నేను, వరవరరావు, వెంకయ్య నాయుడు ఒకే జైల్లో ఉన్నామని ఆ పరిచయంతోనే లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు. శత్రువును చంపడం కాదు క్షమించడం పెద్ద శిక్ష అంటూ భూమన కౌంటర్ ఇచ్చారు.