బీహార్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ న్యూడిల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 కార్మికులు మరణించారని తెలుస్తోంది. మజఫర్ పూర్ జిల్లాలోని బేలా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మోదీ కుర్ కురే, న్యూడిల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా బాయిలర్ పేలుడు సంభవించింది. అయితే ఈప్రమాదంలో మరో 12 మంది దాకా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు శిథిలాల నుండి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) జయంత్ కాంత్ వెల్లడించారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని… అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది శిధిలాలను తొలగిస్తున్నారని.. మృతుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియలేదని ఆయన వెల్లడించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు శబ్ధం సుమారు 5 కిలోమీటర్ల వరకు వినిపించిదని తెలిసింది. ప్రమాదానికి గురైన ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఫ్లవర్ మిల్ కూడా దెబ్బతింది. ఇందులో నిద్రిస్తున్న ఇద్దరు కార్మికులకు కూడా గాయాలయ్యాయి.