వచ్చేనెల 24నుంచి 26 వరకు హైదరాబాద్ మాదాపూర్ వేదికగా బయోఏసియా 20వ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 200 మందికిపైగా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల జాబితాను ఆయన ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీవశాస్త్రాల సంచాలకుడు శక్తి నాగప్పన్‌లతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో విడుదల చేశారు.
సదస్సును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న సదస్సు రాష్ట్రంలో ఔషధ, జీవశాస్త్రాల అభివృద్ధికి దోహదపడిందని.. అదే స్ఫూర్తితో ఈసారి జరుపుతున్న ట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కోవిడ్ అనంతరం బయో పారిశ్రామిక రంగం అవసరం మరింత పెరిగిందని మానవీకరించిన ఆరోగ్య సంరక్షణ తదుపరి తరాన్ని రూపొందించడం అనే నినాదంతో ఈసారి సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.