పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీకి ఊహించని విధంగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్, ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన భారతీయ జనతా పార్టీ తాజాగా మరో ఘోర ఓటమి చవి చూసింది. మహారాష్ట్రలోని పలు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగగా, ఒక్క దులే జిల్లాలో మాత్రమే బిజెపి విజయం సాధించింది.
ఇక్కడ విశేషం ఏంటీ అంటే ఆ పార్టీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ లో కూడా ఘోరంగా ఓడిపోయింది. ఆ నియోజకవర్గ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 58 స్థానాలున్న నాగ్‌పూర్ జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలవగా కేవలం 14 స్థానాలు మాత్రమే గెలిచి బిజెపి రెండో స్థానంలో నిలిచింది.
ఎన్సీపీ 10 స్థానాల్లో విజయం సాధించగా శివసేన 1 స్థానం మాత్రమే గెలుచుకుంది. వాస్తవానికి నాగపూర్ బిజెపికి కంచుకోట కావడమే కాదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి పట్టున్న ప్రాంతం నాగపూర్. అలాంటి జిల్లాలో బిజెపి ఓడిపోవడం ఇప్పుడు ఆ పార్టీ అగ్రనేతలను కలవరపెడుతుంది. ఇప్పటికే తగులుతున్న వరుస షాక్ లతో ఆందోళనలో ఉన్న బిజెపికి ఈ ఫలితాలు మరింత ఇబ్బందిగా మారాయి.