మన దేశంలో లక్ష్మీ దేవికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీ దేవిని మన దేశంలో ఐశ్వర్యానికి, ధనానికి ప్రతిరూపంగా భావించి పూజలు చేస్తాం. మతాలకు అతీతంగా లక్ష్మీ దేవిని ప్రజలు కొలుస్తారు. అలా చేస్తే తమకు సిరి సంపదలు వస్తాయని ప్రజల నమ్మకం. అయితే ఇప్పుడు ఆ లక్ష్మీ దేవిని కరెన్సీ నోట్ల మీద ముద్రించాలి అంటున్నారు బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి.
టెలిగ్రాఫ్ ఇండియా కథనం ప్రకారం చూస్తే, మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట సుబ్రమణ్య స్వామి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇండోనేసియా కరెన్సీ మీద గణపతి చిత్రం ఉండే విషయమై ఒక ప్రశ్నకు గాను కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి చిత్రాన్ని ముద్రించడం తనకు సమ్మతమేనని, ఇలా చేయడం వల్ల భారత కరెన్సీ పరిస్థితి మెరుగు కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గణేషుడు విఘ్నాలను తొలగిస్తాడన్న ఆయన కరెన్సీపై లక్ష్మీ దేవి ఫోటో తనకు సమ్మతమే అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలో ఆర్ధిక మాంద్యం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు దారుణంగా క్షీణించి ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలింది. అటు కేంద్రంలో అనుభవం ఉన్న మంత్రులు లేకపోవడంతో ఆర్ధిక పరిస్థితిని మెరుగు దిద్దే వారు లేకపోయారు.