ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో బడంగ్ పేట్ మేయర్ పారిజాత తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాసమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించిందని ఆరోపించారు. హైదరాబాదులో ఉన్న అనేక సమస్యలపై మోడీ ఎందుకు మాట్లాడలేదని అన్నారు.
రెండు పార్టీలు కలిసే నాటకాలు ఆడుతున్నాయన్నారు. రాష్ట్రంలో విభజన హామీలు చాలా పెండింగులో ఉన్నాయన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇలా చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. అన్యాయంగా, అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బలప్రదర్శన చూపించారని.. కిరాయి వాళ్ళతో బలప్రదర్శన చూపించారన్నారు. దేశంలో మత సామరస్యం దెబ్బతింటోంది అన్నారు రేవంత్.
కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో అనేక ప్రజా పథకాలను తీసుకువచ్చింది అన్నారు. అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ వంటివి కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందాయన్నారు. టిఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీలో చాలామంది జాయిన్ అవుతున్నారు అని తెలిపారు.