హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో 15 రౌండ్లు పూర్తయ్యాయి. పదిహేనవ రౌండ్ ముగిసే సరికి 11,583 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇంకా ఏడు రౌండ్ లు మిగిలి ఉన్నాయి. పదిహేనవ రౌండ్ లో ఈటల రాజేందర్ కు 2,149 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే ఇప్పటికే టిఆర్ఎస్ ఆశలు గల్లంతైనట్లు కనిపిస్తోంది. దాంతో కార్యకర్తలు నేతలు టిఆర్ఎస్ భవన్ ఖాళీ చేస్తున్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ మెజారిటీతో దూసుకు వెళుతుండటంతో బిజెపి కార్యాలయాల్లో సంబరాలు మొదలవుతున్నాయి.

మరో ఏడు రౌండ్ లు ముగిసేసరికి బిజెపికి 15 నుండి 20 వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తం 15 రౌండ్ల లెక్కింపు పూర్తవగా కేవలం రెండు రౌండ్లలో మాత్రమే గెల్లు శ్రీనివాస్ ఆధిక్యం కనబరిచారు. దాంతో టిఆర్ఎస్ ఆశలు ఇప్పటికే గాల్లో కలిసిపోయాయి. మరోవైపు సిద్దిపేటలోని హరీష్ రావు ఇంటివద్ద కూడా కార్యకర్తల హడావిడి కనిపించడం లేదు. సాధారణ సమయాల్లోనే హరీష్ రావు ఇంటివద్ద కార్యకర్తల హడావుడి కనిపిస్తుంది. కానీ రిజల్ట్ డే రోజు కూడా ఒక్క కార్యకర్త కనిపించడం లేదు.