రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశం ఆశ్చర్యంగా సాగింది. మోదీ కన్నీళ్లు పెట్టుకుని మరీ ఆజాద్ ను కీర్తించారు. రాజ్యసభకు ఆజాద్ లాంటి నేతల అవసరం ఎంత ఉందో చెప్పుకొచ్చారు. ఈ మాట కాంగ్రెస్ నేతలు చెప్పి ఉంటే ఆశ్చర్యపడాల్సిందేం లేదు. కానీ, విపక్షాలనుంచి, అదీ ప్రధాని మోదీ నుంచి ఈ తరహా స్పందన రావటం అందర్నీ ఆశ్చర్యపరించింది. పైగా ఆయనను ఎన్నటికీ పదవీ విరమణ చేయనివ్వబోమని, ఆజాద్ సేవలను ఉపయోగించుకుంటామని ప్రధాని మోదీ అనటం అనేక ఊహాగానాలకు కారణమైంది.
ఆ తర్వాత ఓ బహిరంగ సభలో ఆజాద్ ప్రధాని మోదీని ప్రస్తుతించిన తీరు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ.. గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్‌వాలా అని తన మూలాల గురించి నరేంద్ర మోదీ చెప్పుకోవడం గొప్ప విషయమన్నారు. నిజాన్ని దాచని వ్యక్తిత్వం మోదీ సొంతమని అభినందించారు ఆజాద్..ఈ పరస్పర పొగడ్తలే ఇప్పుడు చర్చకు కారణమౌతున్నాయి. బిజెపితో ఆయనకు తెలియని అనుబంధం ఏర్పడుతోందనే కామెంట్స్ పెరుగుతున్నాయి.
అదే సమయంలో జీ 23లో భాగమై ఆజాద్ పార్టీకి దూరమౌతున్నారా? అనేక సందేహాలూ వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూశాక, ఈ జనరేషన్ కాంగ్రెస్ తో ఆజాద్ ఇక పనిచేయటం కష్టమేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పరస్పర పొగడ్తలే కాదు..అంతకుమించిన విషయం కూడా ఇక్కడ ఉందనే చర్చ మొదలైంది. ఆజాద్ కి అత్యున్నత పదవి కట్టబెట్టే అవకాశం ఉందనే వాదన నడుస్తోంది. ఆజాద్ ని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టడం ద్వారా బిజెపి కాశ్మీరీ ముస్లింకి అత్యున్నత స్థానం ఇచ్చామని చెప్పుకోటానికి అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా ఆర్టికల్ 370విషయంలో బిజెపి నిర్ణయానికి నైతిక మద్ధతు లభించినట్టవుతుంది.
అయితే ఇక్కడ ఆజాద్ కి ఉన్న వెసులుబాటే ఏమంటే, అత్యున్నత పదవి తీసుకున్నా, ఆజాద్ బిజెపిలోకి వెళ్లక్కర్లేదు. కాంగ్రెస్ లోనే ఉంటూ పదవిని తీసుకునే అవకాశం ఉంటుందని….ఢిల్లీ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోందట.