తెలంగాణలో అత్యధిక ఓట్లు బీసీ సామాజికవర్గానిదే. హైదరాబాద్‌లోని ముస్లిం ప్రాబల్య ఓటర్ల నియోజకవర్గాలు మినహా ఇక దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపోటములను శాసించేది ఈ సామాజిక వర్గమే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ బీసీ నేతలకు పెద్ద పదవులు దక్కింది లేదు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ రాష్ట్రంలో బలపడాలంటే ముందు బీసీలకు దగ్గరకు కావాలని వ్యూహ రచన చేస్తోంది.
అందుకే మా ప్రభుత్వంలో.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తామంటూ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా బీసీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్‌ను కూడా ముందే ప్రకటించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ రాజకీయ హామీ ప్రకటనలు అటు కాంగ్రెస్…ఇటు టీఆర్ ఎస్‌లోనూ వణుకుపుట్టిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన నాటి నుంచి తెలంగాణలో బీసీ నేతలు ఎక్కువగా ఆ పార్టీలోనే కొనసాగారు.
అయితే తెలంగాణ ష్ట్ర ఆవిర్భావం తర్వాత వారు తలోదిక్కు అన్నట్లుగా వేర్వేరు పార్టీల్లో చేరగా మరికొంతమంది మాత్రం ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతూ రాజకీయాల్లో ఉండీ లేనట్లుగా ఉంటున్నారు. ఇప్పుడు బీజేపీ వారందరినీ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం మొదలుపెట్టింది. గతంలోనే ఈ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టినా ఇప్పుడు మరింత వేగిరం చేసింది. ఈ కోవలోనే టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు, వీరేందర్ గౌడ్ తో పాటు పలువురు బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
బీసీ వర్గానికి ఇప్పటికే జాతీయస్థాయి పదవుల్లో..హోదాల్లో ప్రధానిమోదీ,అమిత్‌షా ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా గురిపెట్టిన కొంతమంది నేతలకు బీజేపీ అగ్రనాయకత్వం గుర్తు చేస్తోంది. అదే వర్గానికి చెందిన తమిళిసైని తెలంగాణకు గవర్నర్‌గా నియమించడం వెనుక కూడా ఈ వ్యూహమే దాగుందని చెబుతున్న వారూ ఉన్నారు. తెలంగాణ బీసీ వర్గానికే చెందిన దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా అవకాశం కల్పించారు. ఇక బీసీ వర్గానికే చెందిన ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను సైతం కొనసాగించే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.