ఇందూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ బీజేవైఎం నాయకుడు భూసం ప్రతాప్ (45) మరణించారు. పూర్తివివరాల్లోకెళితే మృతుడు భూసం ప్రతాప్ ఆయన పెద్దకుమారుడుతో కలిసి వారి వ్యక్తిగత పనిపై సోమవారం ఆర్మూర్ నుంచి నిజామాబాద్ కు బయలుదేరి వెళ్ళారు. నిజామాబాద్ వెళుతుండగా మార్గ మధ్యంలో జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామ శివారులో 63వ నంబర్ జాతీయ రహదారి పై వారి కారు టైరు పేలింది. దీంతో కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని గుద్దింది.
ఈ ఘటన జరిగిన వెంటనే కారు డోర్ వూడిపోయి భూసం ప్రతాప్ కారునుంచి బయటపడ్డాడు. రహదారి గుండా అనుక్షణం వందలాది వాహనాలు వస్తూపోతూ ఉన్నా ఏ ఒక్కరూ కూడా గాయపడ్డ ప్రతాప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో క్షతగాత్రుడు భూసం ప్రతాప్ సుమారు 45 నిమిషాల పాటు ప్రమాదం జరిగిన స్థలంలోనే కొనఊపిరితో కొట్టుమిట్టాడినట్లు సమాచారం. 45 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్న ఆర్మూర్ వాసులు భూసం ప్రతాప్ ను ఇందూరులోని మనోరమ ఆస్పత్రికి తరలించారు. మనోరమ ఆసుపత్రి వైద్య బృందం భూసం ప్రతాప్ ప్రాణాలు రక్షించేందుకు శతవిధాల ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.