సోషల్ మీడియాలో నకిలీ ఫాలోవర్స్ స్కామ్ లో భాగంగా ప్రముఖ ర్యాపర్ బాద్ షా కు ముంబయి పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు కావాలని అతడికి చెప్పారు. కొన్ని వారాల క్రితం సామాజిక మాధ్యమాల్లో నకిలీ, పెయిడ్ ఫాలోవర్స్‌కు సంబంధించిన విషయమై ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ రాకెట్లో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె ఉన్నారని ఇటీవలే వార్తలు వచ్చాయి. వీరితో పాటు ప్రముఖ బిల్డర్లు, క్రీడాకారులూ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
కొన్ని రోజుల క్రితం గాయని భూమి త్రివేది, ఆన్ లైన్ లో తన పేరుతో ఓ నకిలీ ప్రొఫైల్ గమనించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరు మీద ఓ నకిలీ ఇన్స్టాగ్రామ్ పేజీని సృష్టించి నెటిజన్లతో గుర్తుతెలియని వ్యక్తి చాట్ చేశాడని తెలిపింది. ఆ సందేశాల స్క్రీన్ షాట్లనూ అందులో పోస్ట్ చేశారని కంప్లైంయింట్లో పేర్కొంది. బాలీవుడ్ ప్రముఖులు, పలువురు క్రీడాకారులతో సహా 176 మంది సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ను పొందేందుకు డబ్బు చెల్లించారని ముంబయి పోలీసుల దర్యాప్తులో తేలింది.