వారసున్ని రంగంలోకి దించుతున్న వైసీపీ కీలక నేత

-

ఉత్తరాంధ్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడుపుతున్న నేత రూటు మార్చారా..వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తెరవెనక పావులు కదుపుతున్నారా అన్నది ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు భార్య, సోదరుడు, మేనల్లుడిని మాత్రమే రాజకీయాలకు పరిచయం చేసిన ఆయన వారసుడి ఎంట్రీకి పై మాత్రం ఎప్పుడు స్పందించలేదు. కానీ పుట్టినరోజు వేడుకలతో బొత్స కుమారుడు సందీప్‌బాబు రాజకీయ వర్గాల్లో చర్చగా మారారు.

బొత్స సత్యనారాయణ. ఏపీ మంత్రి. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చాలా కాలం కొనసాగారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన..ఒకానొక దశలో సీఎం రేస్‌ వరకు వెళ్లారు. రాజకీయాల్లో స్థిరపడిన తర్వాత భార్యను, ఇతర బంధువులను ఒక్కొక్కరుగా పొలిటికల్‌ ఎంట్రీ చేయించారు. ఇప్పుడు వారసుడినే రంగంలోకి దించబోతున్నట్టు ప్రచారం జోరందుకుంది.

బొత్స భార్య ఝాన్సీ గతంలో విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చేశారు. ఆ తర్వాత ఎంపీగానూ ఉన్నారు. తమ్ముడు అప్పల నర్సయ్యను కాంగ్రెస్‌ హయాంలోనే ఎమ్మెల్యేను చేయగా.. మరో కుటుంబ సభ్యుడు బడ్డుకొండ అప్పలనాయుడిని కూడా నెల్లిమర్ల నుంచి అసెంబ్లీకి పంపించారు. ఇలా ఇప్పటి వరకు భార్య, సోదరుడు, మేనల్లుడిని మాత్రమే రాజకీయాలకు పరిచయం చేశారు బొత్స సత్యనారాయణ. ఆయన కుమారుడు మాత్రం ఇంతవరకు రాజకీయాల్లోకి గానీ.. రాజకీయ చర్చల్లోకి కానీ రాలేదు. బొత్స కుమారుడు సందీప్‌బాబు రాజకీయాలకు దూరంగా విశాఖలో డాక్టర్‌గా స్థిరపడ్డారు.

డాక్టర్‌ సందీప్‌ పుట్టినరోజు సందర్భంగా ఎన్నడూ లేనంతగా విజయనగరం అంతా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలను చూసిన తర్వాత సందీప్‌ పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందని అనుకుంటున్నారట. ఇదే సమయంలో కుమారుడిని వెంటబెట్టుకుని బెజవాడ వెళ్లిన బొత్స సత్యనారాయణ.. సీఎం జగన్‌ బర్త్‌డే సందర్భంగా రక్తదానం చేశారు. దీంతో బొత్స తనయుడి పొలిటికల్‌ ఎంట్రీ ఖాయమని వైసీపీలోనూ రాజకీయ వర్గాల్లోనూ చర్చ జోరందుకుంది. అయితే కొందరు వైసీపీ నేతల్లో పైకి చెప్పకపోయినా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.

ఒకవేళ వారుసుడిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని అనుకుంటే.. ఎక్కడ నుంచి పోటీ చేయిస్తారు అనే చర్చ మొదలైందట. జిల్లాలో మూడు రిజర్వ్‌డ్‌ స్థానాలు వదిలేయగా.. చీపురుపల్లి నుంచి స్వయంగా బొత్స ఎమ్మెల్యేగా ఉన్నారు. గజపతినగరం బొత్స సోదరుడు అప్పలనర్సయ్య, నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడులతో ఫిలప్‌ అయ్యాయి. ఇన్నాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స.. విజయనగరం జిల్లా కేంద్రంపై మాత్రం తన హవా చాటుకోలేకపోయారనే టాక్‌ ఉంది. అందుకే వారసుడిని విజయనగరం నుంచి బరిలో దించుతారనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కోలగట్ల తన కుమార్తె శ్రావణిని బరిలో దించాలనే ప్లాన్‌తో ఉన్నారట.

బొత్స తన కుమారుడిని ఎక్కడ నుంచి పోటీ చేయిస్తారన్నది క్లారిటీ లేకపోయినా.. విజయనగరంలో హడావిడి చూసిన కోలగట్ల శిబిరంలో మాత్రం అలజడి మొదలైందట.

Read more RELATED
Recommended to you

Latest news