సినిమాలు, టీవీలు పిల్లలపై ప్రభావం చూపుతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో పిల్లలు టీవీలో జరిగే సన్నివేశాలను అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఆ అనుకరణే కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉంది. తాజాగా చైనాలో ఒక బాలుడు టీవీ షోను చూసి ఏకంగా పెన్సిల్ ను మింగాడు. బాలుడు మింగిన పెన్సిల్ ను బయటకు తీయడానికి డాక్టర్లు పడిన కష్టం అంతాఇంతా కాదు.
పూర్తి వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన ఒక బాలుడికి టీవీలో కుంగ్ ఫూ షోలు చూడటం అంటే చాలా ఇష్టం. ఆ షోలో ఒక వ్యక్తి కత్తిని తీసుకుని గొంతులోకి దింపుకున్నాడు. బాలుడు కూడా టీవీలో చూపించిన విధంగా కత్తిని గొంతులోకి చొప్పించుకుందామని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా చుట్టూ చూసి కత్తి అందుబాటులో లేకపోవడంతో పెన్సిల్ ను తన గొంతులోకి చొప్పించుకున్నాడు. ఆ పెన్సిల్ బాలుడి కడుపులోకి వెళ్లింది.
ఆ తర్వాత బాలుడు పెన్సిల్ తీయడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో బాలుడు ఏం చేయాలో పాలుపోక ఏడుస్తూ తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. తల్లిదండ్రులు వెంటనే బాలుడిని జెంగ్జౌలోని హెనన్ ప్రొవెన్సియల్ చిల్ట్రన్ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. డాక్టర్లు కొన్ని గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించారు. వైద్యులు మాట్లాడుతూ బాలుడు పెన్సిల్ ముల్లు తిరగేసి మింగడం వల్ల ఏం కాలేదని చెప్పారు. బాలుడు స్పందిస్తూ టీవీ షో ను అనుకరించాలని అనిపించి పెన్సిల్ మింగానని చెప్పాడు. వైద్యులు పిల్లలు టీవీ చానెళ్లలో ఏం చూస్తున్నారో ఒక కంట కనిపెడుతూ ఉండాలని బాలుడి తల్లిదండ్రులకు సూచించారు.