నేటి సమాజంలో టెక్నాలజీ వాడకం రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే.. ఇప్పుడున్న కరోనా పరిస్థితులుకు పిల్లలకు చిన్నవయసులోనే స్మార్ట్ ఫోనులు చేతిలోకి రావడంతో గేమ్స్ పిల్లలకు వ్యసనంగా మారుతున్నాయి. పిల్లలకు చాలా రకాల గేమ్స్‌కు బానిసలుగా మారి.. వద్దని వారిస్తే దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చోటు చేసకుంటున్న నేపథ్యంలో.. తాజాగా మరో ఉదాంతం వెలుగులోకి వచ్చింది. మొబైల్‌లో గేమ్స్ ఆడటాన్ని తల్లి అడ్డుకోవడంపై మనస్తాపం చెందిన ఓ బాలుడు రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దిండోషి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్‌లో అదే పనిగా గేమ్స్ ఆడటంపై బుధవారం సాయంత్రం తల్లి మందలించింది. అతడి నుంచి మొబైల్ ఫోన్ తీసుకుంది. చదువుకోవాలని చెప్పి ఆమె బయటకు వెళ్లింది.
అయితే మనస్తాపం చెందిన ఆ బాలుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇక తిరిగి రానని పేర్కొంటూ ఒక సూసైడ్ నోట్ రాశాడు. అనంతరం రైలు పట్టాల వద్దకు వెళ్లి వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, కుమారుడు రాసిన సూసైడ్ నోట్ చూసి ఆందోళన చెందింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆ బాలుడి కోసం వెతకసాగారు. మరోవైపు మలాడ్-కండివాలి స్టేషన్ల మధ్య ఒక బాలుడు రైలు ముందు దూకి చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి కుటుంబాన్ని తీసుకుని అక్కడకు వెళ్లారు. మరణించిన బాలుడు ఆ కుటుంబానికి చెందిన వాడేనని గుర్తించారు. బోరివలి ప్రభుత్వ రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.