ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. ఈనెల 5న జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ భావించారు. అయితే కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో ఉన్నతాధికారుల సూచనల మేరకు జగనన్న విద్యా కానుక పంపిణీ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. మరో రెండు రోజుల్లో ఎప్పుడు పథకం ప్రారంభిస్తారో తేదీని ఖరారు చేయనున్నారు. కాబట్టి మండల విద్యాశాఖ అధికారులు స్టాక్ పాయింట్ నందు ఉన్న జగనన్న కానుకలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు జగనన్న విద్యా కానుక కిట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరియు బయోమెట్రిక్ డివైస్, ఐరిష్ డివైజ్ లను చార్జింగ్ చేసి జగనన్న విద్యా కానుక యాప్ డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండాలని సీఎంవో విభాగం ప్రకటించింది. ఇకపోతే ఏపీలో స్కూల్స్ ని అక్టోబర్ 5న ఓపెన్ చేయాలని జగన్ సర్కార్ భావించింది. అయితే కరోనా తీవ్రత నేపథ్యంలో దాన్ని నవంబర్ 2కు వాయిదా వేశారు. దీంతో జగన్న విద్యాకానుక పథకం కూడా నవంబర్ 2కే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.