ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రయాణం మొదలుపెట్టిన జనసేన బిజెపి ఇప్పుడు మరో అడుగు ముందుకి వేసినట్టు తెలుస్తుంది. కేంద్ర మంత్రి వర్గంలోకి జనసేన వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. గత నాలుగు నెలలుగా జనసేన బిజెపి కలిసే అవకాశం ఉందని లేదా జనసేన బిజెపిలో విలీనం అయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతూ వచ్చింది.
ఈ నేపధ్యంలోనే పలు మార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇదే విషయమై బిజెపి అగ్రనేతలతో చర్చలు జరుపుతూ వచ్చారు. అటు సంఘ్ పరివార్ తో కూడా ఆయన చర్చలు జరిపారు. ఎట్టకేలకు గత వారం రోజులుగా జరిగిన పరిణామాలు అన్ని కూడా జనసేన, బిజెపిలో విలీనం కావడం ఖాయమనే భావించారు అంతా. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్, బిజెపితో పొత్తు పెట్టుకుని ఒక స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఒక కీలక వార్త బయటకు వచ్చింది.
జనసేన కీలక నేత, సిబిఐ జెడి లక్ష్మీ నారాయణను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆయనను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలో బిజెపి ఉందని టాక్. సంఘపరివార్ తో జరిపిన చర్చల్లో కూడా పవన్ ఈ విషయాన్ని ప్రతిపాదించగా వాళ్ళు కూడా అంగీకరించారని అంటున్నారు. త్వరలోనే అన్ని అనుకున్నట్టు జరిగితే ఒక కీలక శాఖకు ఆయన సహాయ మంత్రి అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే జరిగితే జనసేన కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం వస్తుందని పవన్ భావిస్తున్నారు.