ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఇరు పార్టీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర, దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు భేషరతుగా పవన్ అంగీకరించారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళతామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ విమర్శలు గుప్పించారు.
పవన్ వెనుక ఉన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆయన ఆరోపణలు చేశారు. గతంలో కమ్యూనిస్టు పార్టీ, బీఎస్పీ.. ఇప్పుడు బీజేపీతో జనసేన కలవడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘యాక్టర్ నిమిత్త మాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్యూనిస్టులతో కలిసినా, బీఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే’ అని ట్వీట్ చేశారు.