కరోనా మహమ్మారి వ్యాప్తికి ఇదో కీలక ఉదాహరణ…! అతనో ఇంజనీర్, వివాహం కుదరడంతో పట్నం నుండి తన ఊరికి చేరుకున్నాడు. పట్నం లో కరోనా తారాస్థాయిలో ఉంది. ఊరు చేరకముందే అతనికి విరేచనాలు ఉన్నాయి. ఎలాగో అలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన మర్నాడే మృతిచెందాడు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కరోనా అని నిర్ధారణ చేశారు. పెళ్ళికి చాలామంది అతిధులు హాజరయ్యారు. అందరికీ టెన్షన్ టెన్షన్. కాగా వారిని టెస్ట్ చేయగా వారిలో 111 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
వివరాల్లోకి వెళితే… బీహార్‌లోని పట్నా జిల్లా పాలిగంజ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గుర్‌గావ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి జూన్ 15న వివాహం నిశ్చయమైంది. తేదీ దగ్గరపడటంతో నాలుగు రోజుల ముందే సొంతూరుకు చేరుకున్నారు. అయితే అప్పటికే కరోనా లక్షణాల్లో ఒకటైన డయేరియాతో బాధపడుతున్నాడు. కాగా జూన్ 15 న తన వివాహం జరిగింది. వివాహానికి బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాని వివాహం జరిగిన రోజు తన సమస్య తీవ్రత పెరగడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన మర్నాడే అతను చనిపోయాడు, పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. వివాహానికి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు, దాంతో ఏకంగా 111 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరినీ ఇసోలేషన్ కు తరలించారు. ఈ ఘటన యావత్ దేశాన్నే కదలించింది.