కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని కంటైన్‌మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను జూలై 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. ఆసుపత్రులు, మెడికల్ షాపులు తప్ప మిగితా షాపులు రాత్రి 9.30 గంటల తర్వాత తీసి ఉంచడానికి వీలు లేదు. అలాగే అత్యవసర ప్రయాణానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
లాక్ డౌన్ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశించింది. ముఖ్యంగా హైదరాబాదు కంటోన్మైంట్ జోన్లలో కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. అలాగే కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది.