కరోనా వైరస్ బారిన పడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత వారం ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. కానీ వైరస్ లక్షణాలు ఇంకా కనిపిస్తుండటంతో ఆదివారం ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. బోరిస్ వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కానీ నిన్న వ్యాధి తీవ్రత పెరగడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు.
గతవారం ఆయనకు కరోనా పాజిటివ్ తేలడంతో అప్పటి నుంచి ఆయన స్వీయ నిర్భందంలోనే ఉన్నారు. ఏడు రోజుల తర్వాత బయటకు రావొచ్చని వైద్యులు సూచించినప్పటికీ..ఆయనలో ఇంకా కొన్ని వైరస్ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో తన నిర్భందాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించుకుంటున్నట్లు ఆయనే స్వయంగా వీడియో సందేశం పంపారు. “నా ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గానే ఉంది. నా ఏడు రోజుల నిర్భందం కూడా పూర్తయింది. అయినా నాలో ఇంకా స్వల్పంగా వైరస్ లక్షణాలు ఉన్నాయి. ఇంకా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత కాలం నేను స్వీయ నిర్భందంలోనే ఉంటాను“అని జాన్సన్ తెలిపాపు. అయితే వ్యాధి తీవ్రత పెరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు.