కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటి దగ్గర ఉండి పనిచేసే వారి కోసం బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నెల రోజుల పాటు ఇంటర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ల్యాండ్ లైన్ కనెక్షన్‌ను వాడుతున్న వినియోగదారులు లేదా కొత్త వినియోగదారులు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలియజేసింది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను వాడుతున్న కస్టమర్లు లేదా నూతన వినియోగదారులు తమ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ పొందవచ్చని, బీఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ తీసుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ సీఎఫ్ఏ డైరెక్టర్ వివేక్ బంజాల్ తెలిపారు. ఈ క్రమంలో వినియోగదారులు ఇన్‌స్టాలేషన్ చార్జిలు కూడా చెల్లించాల్సిన పనిలేదని, కేవలం మోడెమ్ ఖర్చు భరిస్తే చాలని అన్నారు.
ఇక కస్టమర్లు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నాక నెల రోజుల వరకు ఇంటర్నెట్‌ను ఉచితంగా వాడుకోవచ్చని, అయితే ఆ తరువాత ఏదైనా ఒక ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అయితే ఈ ప్లాన్‌ను పొందాలంటే తమ ఆఫీస్‌కు రావాల్సిన పనిలేదని, కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తే చాలని ఆ సంస్థ తెలియజేసింది. కరోనా వైరస్ నేపథ్యంలోనే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని ఆ సంస్థ అధికారులు తెలిపారు.