ఫిబ్రవరి 1న 2023 బడ్జెట్ ని సమర్పించనున్నారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. నిర్మల సీతారామన్ గురువారం ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక ప్రారంభించారు. బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ హల్వా వేడుక గురువారం జరిగింది.
కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయమైన నార్త్ బ్లాక్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్థిక శాఖ ఆనవాయితీగా నిర్వహిస్తోంది. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణాలవల్ల హల్వా వేడుక జరగలేదు. ఇదిలా ఉంటే గత రెండు బడ్జెట్ల మాదిరిగానే ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ 2023 – 24 సైతం పేపర్ లెస్ గా డిజిటల్ గా ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి.
గతేడాది బడ్జెట్ గురించిన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు మొబైల్ యాప్ తీసుకువచ్చింది కేంద్రం. అందులో ఇప్పటివరకు ప్రవేశపెట్టిన బడ్జెట్ లకు సంబంధించిన వివరాలు ఉంటాయి. దీనిని యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ WWW.indiabudget. gov. in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.