తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం సేకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కోరారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలని లేఖలో ప్రధాని మోడీని కోరారు. వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం సేకరించక పోతే.. కనీస మద్ధతు ధరకు అర్థం ఉండదని లేఖలో సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి పూర్తిగా వరి ధాన్యాన్ని సేకరించకపోతే.. రైతులపై, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
అలాగే జాతీయ భద్రతా లక్ష్యానికి కూడా విఘాతం కలుగుతుందని లేఖలో అన్నారు. దేశం మొత్తం ఒకే రకంగా ఆహార ధాన్యాల సేకరణ జరగాలని కోరారు. అందు కోసం ప్రత్యేకంగా ఒక చట్టం కూడా తీసుకురావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం.. వివిధ రాష్ట్రాలకు.. వివిధ విధానాలను అవలంభిస్తుందని అన్నారు. అది కరెక్ట్ కాదని అన్నారు.
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సేకరిస్తున్నట్టే.. తెలంగాణలోనూ వంద శాతం వరి ధాన్యాన్ని సేకరించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని అన్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు కూడా తగ్గాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేఖలో కోరారు.