ఏపీలో విపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వరుస పెట్టి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే కోడెల, మరో సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు కేసుల్లో చిక్కుకున్నారు. ఇక ఇప్పుడు మరో సీనియర్ నేత, ఎమ్మెల్యేపై పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంపై బుధవారం చీరాల ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది.
చీరాలలో కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వలంటీర్ల ఎంపికలో బలరాం తాను చెప్పిన వాళ్లకు ఇవ్వాలని స్థానిక అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ వాళ్లు అర్హులకే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వార్‌లో బలరాం ఒక రోజు స్థానికంగా ఎంపీడీవో కార్యాలయంలోనే మకాం వేసి మరీ అధికారులను లిస్ట్ మార్చాలంటూ ఒత్తిడి చేశారు.
ఇదిలా ఉంటే ఆగస్టు 15న ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ టైంలో ప్రొటోకాల్ విషయమై ఎమ్మెల్యే బలరాంను స్థానిక వైసీపీ నేత, మాజీ కౌన్సెలర్ యడం రవిశంకర్ ప్రశ్నించారు. దీంతో బలరాం నన్నే ప్రశ్నిస్తావా… నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా… కోర్టు సూచనల మేరకు బలరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు.