పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారి నడ్డి విరిచిన కేంద్రం తమ నిర్ణయాలతో ఏం సాధించిందో ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ వాటి వల్ల జరిగిన లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారి నడ్డి విరిచిన కేంద్రం తమ నిర్ణయాలతో ఏం సాధించిందో ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ వాటి వల్ల జరిగిన లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దీని వల్లే ఆర్థిక మాంద్యం వచ్చిందన్నది మరికొందరి వాదన. అయితే ఈ విషయం ఎలా ఉన్నప్పటికీ.. మోదీ మాత్రం డిజిటలైజేషన్ దిశగానే పెద్ద నోట్లను రద్దు చేశామని ఒక కారణం చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అది ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకుంటే చార్జిలను వసూలు చేయలేదు. కానీ మొన్నీ మధ్య నుంచే ఆ చార్జీలను మళ్లీ వడ్డిస్తున్నారు. ఇక దీంతోపాటు వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది.
ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా లావాదేవీలు నిర్వహించి పెట్రోల్ బంకులలో ఇంధనం నింపుకుంటే వాహనదారులకు 0.75 శాతం రాయితీ ఇస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఆ రాయితీని వినియోగదారులు చేసిన లావాదేవీకి సంబంధించిన ఖాతాకు తరువాత ట్రాన్స్‌ఫర్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇకపై ఈ రాయితీని కేంద్రం నిలుపుదల చేయనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ రాయితీని అందివ్వడం నిలిపివేయనున్నారు. అంటే.. ఇకపై పెట్రోల్ బంకుల్లో పైన చెప్పిన మాధ్యమాలను ఉపయోగించి వాహనంలో ఇంధనం నింపుకుంటే.. ఆ తరువాత రాయితీని ఇవ్వరన్నమాట. అంటే.. మోదీ చెబుతున్న డిజిటలైజేషన్ ఇక మిథ్యేనని అర్థమవుతుంది.
అసలు నోట్లను రద్దు చేయడం ఎందుకు.. డిజిటలైజేషన్ ఎందుకు.. ప్రజలను కేవలం ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు చేయడమని చెప్పడం ఎందుకు.. ఈ రాయితీలు ఎవరు ప్రకటించమన్నారు.. ఎవరు ఆపేయమన్నారు.. ఏమిటో మాయ.. పాలకుల నిర్ణయాలు అసలు ప్రజలకు ఏమీ అర్థం కావు. వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రజల నడ్డి విరుస్తారో చెప్పలేం. ఏంటో ఖర్మ.. మనం వారికి ఓట్లు వేసి వారిని ఎన్నుకున్నందుకు.. మనల్ని మనమే తిట్టుకోవడం తప్ప చేసేదేమీ లేదు.. ఏం చేస్తాం.. తప్పదు మరి..!