ట్ర‌బుల్ షూట‌ర్ లేకుండా అక్క‌డ గెల‌వ‌గ‌ల‌రా..?

-

ట్ర‌బుల్ షూట‌ర్‌, మంత్రి హ‌రీశ్‌రావు లేకుండా హుజూర్‌న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ గెల‌వ‌గ‌ల‌దా..? ఈ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను మండ‌లిలో ప్ర‌భుత్వ విప్ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి గులాబీ ద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్ అప్ప‌గించ‌డం సాహ‌స‌మేనా..? ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ఉత్ప‌న్న‌మ‌వుతున్న ప్ర‌శ్న‌లివి. నిజానికి.. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కం. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థాన‌మే అయినా.. గ‌త ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కేవ‌లం స్వ‌ల్ప‌తేడాతోనే టీఆర్ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డిపై గెలిచారు.

ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఉత్త న‌ల్ల‌గొండ ఎంపీగా గెల‌వ‌డంతో.. హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఈ ఉప ఎన్నిక రెండు పార్టీల‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ ఓడిపోతే.. అది రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌నంగా మారే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్లో ఎలాగైనా గెల‌వాల్సిన అనివార్య ప‌రిస్థితులు టీఆర్ఎస్ ముందున్నాయి. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో స‌హ‌జంగా ట్ర‌బుల్‌షూట‌ర్ హ‌రీశ్‌రావును కేసీఆర్ రంగంలోకి దింపుతారు. కానీ.. అనూహ్యంగా.. ఈ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను గులాబీద‌ళ‌ప‌తి, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి అప్ప‌గించారు.

ఇప్ప‌టికే ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల అయిన రోజే శానంపూడి సైదిరెడ్డిని పార్టీ అభ్యర్థిగా కేసీఆర్‌ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా నియమించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను సమన్వయపరచాలని పల్లాను కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేప‌థ్యంలోనే పార్టీవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. నిజానికి.. గ‌త కొంత‌కాలం నుంచి కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయిన హ‌రీశ్‌రావుకు.. ఇటీవ‌ల చేప‌ట్టిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో స్థానం ల‌భించ‌డం.. ఏకంగా ఆర్థిక మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం తెలిసిందే. దీంతో మ‌ళ్లీ హ‌రీశ్‌రావుకు కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు.

కానీ.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను మంత్రి హ‌రీశ్‌రావును కాద‌ని ప‌ల్లాకు అప్ప‌గించ‌డంతో గులాబీ శ్రేణులు కొంత డౌటుప‌డుతున్నాయి. నిజానికి.. అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ హ‌రీశ్‌రావు అనేక స్థానాల్లో పార్టీని గెలిపించారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్తే.. అక్క‌డ పార్టీ విజ‌యం ఖాయ‌మ‌నే గుర్తింపు ఆయ‌న‌కు ఉంది. ఈ నేప‌థ్యంలో హుజూర్‌న‌గ‌ర్‌లో ప‌ల్లాకు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కేసీఆర్ చేసిన సాహ‌స‌మేన‌ని ప‌లువురు అంటున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో..!

Read more RELATED
Recommended to you

Latest news