ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్‌ను కేవలం మనుషులకే కాదు, జంతువులకు కూడా ఇవ్వాలని సైంటిస్టులు చెబుతున్నారు.
కరోనా నేపథ్యంలో జంతువుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సైంటిస్టులు తెలిపారు. పిల్లులు, కుక్కలకు కరోనా వచ్చే అవకాశాలు ఉన్నందున వాటికి కూడా వ్యాక్సిన్ వేయాలని అంటున్నారు. అయితే కరోనా వాటికి వ్యాపించినప్పటికీ వాటి మీద కరోనా ప్రభావం లేదు, కానీ వాటి ద్వారా కొత్త రకం కరోనా వైరస్ లేదా ఇతర కొత్త వైరస్‌లు మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, కనుక వైరస్‌లు మనుషులకు వ్యాపించకుండా ఉండాలంటే జంతువులకు కూడా వ్యాక్సిన్ వేయాలని సైంటిస్టులు తెలిపారు.
కాక్‌వాన్ ఊస్టర్ హౌట్ అనే ప్రొఫెసర్ ఇదే విషయమై మాట్లాడుతూ.. పిల్లులు, కుక్కలకు కరోనా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైందన్నారు. అయితే వాటికి కరోనా వ్యాపించినా వాటిపై వైరస్ ప్రభావం ఉండదన్నారు. కానీ వాటి నుంచి వైరస్ మనుషులకు వ్యాపించవచ్చని, అలాగే వాటిల్లో వైరస్ కొత్తగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని, దీంతో కొత్త వైరస్‌లు మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉంటాయన్నారు. అలా గనక జరిగితే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని, కనుక పిల్లులు, కుక్కలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని అన్నారు. ఇక ఈ విషయమై రష్యా ఇప్పటికే ప్రయోగాలు మొదలు పెట్టిందని, జంతువుల కోసం ప్రత్యేకంగా కోవిడ్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నారని తెలిపారు.