వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి సీబీఐ తాజాగా నోటీసులు జారీ చేసింది. మంగళవారం (మే 16) మధ్యాహ్నం కోఠీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఆ నోటీసులలో స్పష్టం చేసింది. హైదరాబాద్ నుంచి కడపకు బయలుదేరిన అవినాష్ నోటీసులు అందుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అందరూ అనుకున్నట్లుగానే కర్నాటక ఎన్నికల ఫలితాల వరకూ ఎదురు చూసిన సీబీఐ వెంటనే రంగంలోకి దిగింది. వివేకా హత్య కేసులో ప్రస్తుతం కారాగారంలో ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది.
ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.