దిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ, సీబీఐలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ కేసులో తాజాగా దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియాకు సీబీఐ మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణ నిమిత్తం రేపు ఉదయం సీబీఐ కేంద్ర కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సిసోదియా పేరు లేదు. ఈ కేసులో దొరికిన తాజా ఆధారాలపై ప్రశ్నించేందుకు ఆయనకు సమన్లు జారీ చేసినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
తాజా సమన్లపై సిసోదియా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు రావాలని సీబీఐ నన్ను మరోసారి పిలిచింది. నాకు వ్యతిరేకంగా వారు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సీబీఐ , ఈడీల పూర్తి స్థాయి అధికారాలను ఉపయోగిస్తున్నారు. ఆ అధికారులు గతంలో నా ఇంట్లో పలుమార్లు సోదాలు చేశారు. నా బ్యాంకు లాకర్‌నూ తనిఖీ చేశారు. అందులో వారికి ఏం దొరకలేదు. దిల్లీలోని పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. నన్ను అడ్డుకోవాలని వారు చూస్తున్నారు. విచారణకు నేను ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాను’’ అని సిసోదియా ట్విటర్‌లో వెల్లడించారు.