మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టును సీబీఐ కోరింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ ఈమేరకు వాదించింది.
‘అవినాష్‌ను విచారించి అనేక విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదు. వివేకా హత్య కుట్ర అవినాష్‌రెడ్డికి తెలుసు. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించాం. హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్, ఉదయ్ ఉన్నారు. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలి’’’ అని కోర్టుకు సీబీఐ తెలిపింది. సీబీఐ వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు విచారణను మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేసింది.