తెలంగాణాకు 224.50 కోట్లను విడుదల చేయనున్న కేంద్రం !

భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోడానికి, పునరావాస కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కి 224.50 కోట్ల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు రాష్ట్రవ్యాప్తంగా పంటలు, ఇళ్లు కోల్పోయిన రైతులు, ప్రజల కోసం సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

 

నిబంధనల ప్రకారం నిధులు వాస్తవానికి ఫిబ్రవరి-మార్చి, 2021 లో విడుదల చేయాల్సివుంది. అయినా పునరావాస పనులను వెంటనే, చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఈ నిధులు అందుబాటులో ఉండాలని భావించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపి, హైదరాబాద్, తెలంగాణాలో ప్రస్తుత పరిస్థితులని, నిధుల యొక్క ఆవశ్యకతను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను పంపించారు. దీంతో ఈ నష్ట సహాయానికి ముందస్తుగా 224 కోట్లు50 లక్షలు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.