వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేస్తూ కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది. నేడు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. రైతులు నిరసనను విరమించాలని కోరారు. పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాకు చెందిన రైతులు ఆందోళనను ముగించి ఇంటికి తిరిగి వెళ్లాలని కోరారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)తో సంప్రదింపులు జరిపిన తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఖరారు చేసినట్లు సమాచారం.
నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో భారత ప్రభుత్వం ‘ది ఫార్మ్ లాస్ రిపీల్ బిల్లు, 2021’ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా పార్లమెంట్లలో బిల్లు పాస్ అయ్యేదాకా నిరసనలను విరమించేది లేదని రైతులు అంటున్నారు. ఇదే కాకుండా ఎంఎస్పీ మద్దతు బిల్లును కూడా పార్లమెంట్ లో తీసుకురావాలని, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల సంఘాలు కోరుతున్నాయి.